ఛాంగురే ఛాంగురే మమత నిను కోరే
ఛాంగురే ఛాంగురే చెలిమి నిను చేరే
అల్లుకున్న బంధాలు చల్లుతున్న చందనాలు
వెల్లువైన వేళలో తిరిగి తెల్లవారే
||ఛాంగురే ఛాంగురే||
అన్నయ్యా! నీ అలక పైపైనేనని తెలుసులేవయ్యా
తమ్ముడూ! నీకు తెలుసన్న సంగతి నాకు తెలుసయ్యా!!
ఎన్ని కలలో… వెంట తెచ్చెనంట చూడముచ్చటైన మురిపెం
ఎన్ని సిరులో… రాశి పోసినంట సంకురాత్రి వంటి సమయం
|మనసే కోరే…
అనుబంధాలు దరి చేరే
తరతరాల తరగని వరాల గని అని మనింటి మమతని
మరి మరి పొగిడిన పదుగురి కను వెలుగై
సాగుతున్న వేళలో మనది పూలదారే
||ఛాంగురే ఛాంగురే||
కొమ్మలో కోయిలను కమ్మగ లేపిన కిలకిల సంగీతం
గొంతులో మేలుకొని కోటి మువ్వల కొంటె కోలాటం
ఎంత వరమో… రామచంద్రుడంటి అన్నగారి అనురాగం
ఏమి ఋణమో… లక్ష్మణుణ్ణి మించు చిన్నవాని అనుబంధం
ఇపుడే చేరే
పది ఉగాదులకు సారె
ప్రియస్వరాలు చిలికిన వసంత వనముగ అనేక జన్మల
చిగురులు తొడిగిన చెలిమికి కలకాలం
స్వాగతాలు పాడనీ సంబరాల హోరే
||ఛాంగురే ఛాంగురే||
🌳🌾🌾🍀🍁🍁🏵🏵🌱🌿🌿🌱🍁🍀🌾🌳🌳🌾🍁🌱
Comments
Post a Comment